Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sridevi Kapoor (Actress)ప్రముఖ నటి శ్రీదేవి రాత్రి కన్నుమూశారు. దుబాయ్ లో బంధువుల వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవి గుండెపోటు తో తుదిశ్వాస విడిచారు .

1963 ఆగస్టు 13 న తమిళనాడులోని శివకాశి లో ఆమె జన్మించారు . 1969 లో శ్రీదేవి 4 సంవత్సరాల వయసులోనే బాలనటిగా తమిళ్ సినిమాలో నటించింది. అలాగే 1970 లో మా నాన్న నిర్దోషి సినిమాతో తెలుగులో బాలనటిగా నటించింది. 1975 లో నటిగా తెరంగేట్రం చేశారు. తెలుగు , తమిళం , మలయాళం , కన్నడ , హిందీ తదితర భాషల్లో 259 సినిమాలలో  నటించిన శ్రీదేవి తన అందంతో అభినయంతో అభిమానుల హృదయాలలో నిలిచిపోయింది. భర్త బోనికపూర్ , కూతురు ఖుషి కపూర్ కలిసి ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు శ్రీదేవి దుబాయ్ వెళ్లి  శనివారం అర్ధరాత్రి 11:30 సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు.

శ్రీదేవి నటించిన సినిమాలు
తమిళ్ లో 72 సినిమాలు
మలయాళం లో 26 సినిమాలు
తెలుగులో 83 సినిమాలు
కన్నడలో 6 సినిమాలు
హిందీలో 72 సినిమాలు

శ్రీదేవిగారు యన్. టి.రామారావు గారితో 1972 లో బడిపంతులు సినిమాలో బాలనటిగా నటించి, 1979 లో వేటగాడు సినిమాతో హీరోయిన్ గా యన్. టి.రామారావు సరసన నటించింది. హీరోయిన్ గా యన్. టి.రామారావు తో 13 సినిమాలలో నటించింది.

శ్రీదేవిగారు సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలలో 33 సినిమాలలో నటించారు,  1979 లో "బుర్రిపాలెం బుల్లోడు" చిత్రం తో తొలిసారిగా కృష్ణ గారితో జత కట్టారు.

చిరంజీవితో 8 సినిమాలు లో నటించారు.

బాలక్రిష్ణ తో 4 సినిమాలు లో నటించింది (అయితే ఈ సినిమాలు యన్. టి.రామారావు బాలక్రిష్ణ కలిసి నటించిన సినిమాలు)

ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని వేడుకుందాం.


*****  ******  ******


శ్రీదేవి మరణం గురించి తోటి నటులు, నిర్మాతలు వారి మాటల్లో:


'అతిలోక సుందరి' నుంచి నేనెంతో నేర్చుకున్నా: చిరంజీవి

నా పుట్టినరోజున చివరిసారి కలిశా, మా అతిలోక సుందరి ఇక లేదు. ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. అందం, అద్భుతమైన అభినయం కలగలసిన నటి శ్రీదేవి.

అలాంటి నటిని నేనుప్పుడూ చూడలేదు.తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను.

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో.. దేవకన్య పాత్రలో శ్రీదేవి అలవోకగా నటించడం చూసి ఆశ్చర్యపోయాను. తను మా కుటుంబానికి చాలా సన్నిహితురాలు.

చివరిసారిగా నా 60వ పుట్టినరోజున తనను కలిశాను. ఆమె లేదంటే నమ్మలేకపోతున్నాను. ఆమె కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకొంది.

మా హృదయాల్లో ఇంకా జీవించి ఉంది. సినిమా పరిశ్రమ ఉన్నంత వరకూ తను జీవించే ఉంటుంది. ఇది దేశానికి, సినిమా పరిశ్రమకు ఇది తీరని లోటు.


ఇది నాకు షాక్..! : వెంకటేష్

ఇది నాకు షాక్..! ఇది ఓ దురదృష్టమైన రోజు. గొప్ప నటిని కోల్పోయాం.

క్షణ క్షణం సినిమాలో ఆమె పలికించిన హావభావాలు మన మనసుల్లో చెదిరిపోని ముద్ర వేశాయి. చాలా చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, చాలా వినమ్రతగా ఉండేది.

సినిమాల్లోకి రావాలనుకునే వారికి శ్రీదేవి ఓ ఉదాహరణ. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.

ఇల్లాలు సినిమాలో మా పాత్రలు మార్చుకున్నాం : జయసుధ

నేను ఒక స్నేహితురాలిని కోల్పోయా. దేశం ఒక గొప్ప నటిని కోల్పోయింది. నటన విషయంలో ఎవ్వరూ శ్రీదేవికి సాటి రారు. శ్రీదేవి లేదంటే.. నమ్మలేకపోతున్నాను.

తను ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది. శ్రీదేవిని మొదటిసారి కలిసినపుడు నాకు పదేళ్లు, తనకు ఐదేళ్లు.

అప్పుడు విజయనిర్మల గారితో కలిసి శ్రీదేవి నటిస్తుండేది. తర్వాతి కాలంలో క్రిష్ణ గారితో కూడా నటించింది.

ప్రేమాభిషేకం, ఇల్లాలు సినిమాల్లో ఇద్దరం కలిసి నటించాం. నాకు ఓ విషయం గుర్తుకు వస్తోంది..

‘ఇల్లాలు’ సినిమాలో నాది కాస్త సీరియస్‌గా ఉండే పాత్ర. శ్రీదేవిది గ్లామరస్ రోల్.

కానీ శ్రీదేవికి అది ఇష్టం లేదు. నా పాత్రను చేస్తానని అడిగింది. ‘ఎప్పుడూ గ్లామరస్ పాత్రలు చేస్తున్నా. ఇప్పుడు నీ పాత్రలో నటిస్తాను’ అని అడిగింది.

అప్పుడు మా పాత్రలను మార్చుకున్నాం. నటన అంటే ఆమెకు అంత ఇష్టం. శ్రీదేవి డైరెక్టర్స్ యాక్టర్.

తెలుగు, హిందీ సినిమాల నటనలో చాలా వైరుధ్యం కనిపిస్తుంది. తనను తాను అంత బాగా మలుచుకోగలదు. సూపర్ స్టార్ అనే గర్వం ఆమెకు ఉండదు. చాలా వినయంగా ఉంటుంది.

కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. తన క్యాస్టూమ్స్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటుంది. శ్రీదేవి ఒక పర్ఫెక్షనిస్ట్!

ఈమధ్య శ్రీదేవితో మాట్లాడినపుడు.. నాకు జుట్టుకు రంగు వేసుకుంటే అలర్జీ వస్తోందని, రంగు వేయడం మానేస్తానని అంటే..

‘మనం సెలబ్రిటీలం. చూడతగ్గట్టుగా ఉండాలి. జుట్టు తెల్లగా ఉన్నా ఫర్వాలేదు. నువ్వు నీలాగే ఉండు. కానీ ప్రజాజీవితంలో ఉన్నామని మాత్రం గుర్తుపెట్టుకో!’ అంది.

చివరిసారిగా పెద్దమ్మాయి జాహ్నవి గురించి మాట్లాడుకున్నాం. జాహ్నవి సినిమా విడుదలవబోతోంది.

''సూపర్ స్టార్ కూతురు సినిమా అంటే జాహ్నవి పట్ల అంచనాలు భారీగానే ఉంటాయి. కానీ.. నేను సూపర్ స్టార్‌గా కాదు.. జాహ్నవి తల్లిగానే ఆలోచిస్తున్నా'' అంది. శ్రీదేవి లేదన్న వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా.

మా ఇంట్లో ఆడుకునేది : క్రిష్ణ

శ్రీదేవి చిన్నతనంలో మా పక్కింట్లోనే ఉండేవాళ్లు. తను మా ఇంట్లోనే ఎక్కువ సేపు ఉండేది. శ్రీదేవితో కలిసి 34 సినిమాలు చేశాను. కానీ.. చిన్న వయసులోనే ఇలా జరగడం బాధగా ఉంది.

నేను కుంగి పోయాను: కోట శ్రీనివాస రావు

నేను మాట్లాడలేకపోతున్నాను. శ్రీదేవి మరణ వార్తతో కుంగిపోయి ఉన్నా. ఇంత చిన్న వయసులో తనకెందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు.

ఆమెకు శాంతి చేకూర్చాలని, ఆ నటరాజ స్వామిని ప్రార్థిస్తున్నా.

ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నా.


‘మహానటి’ సినిమా శ్రీదేవికి అంకితం ఇస్తున్నాం : అశ్వినీదత్

ఇది నా జీవితంలోనే అత్యంత విషాదకరమైన రోజు.

ఈ రోజును ఎప్పటికీ మరువలేను. మాకు, వైజయంతీ మూవీస్ కుటుంబానికి ఎంతో డబ్బు, పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెట్టింది.

నా భార్యకు, నా పిల్లలకు శ్రీదేవి మంచి ఫ్రెండ్. మా బ్యానర్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, గోవిందా గోవిందా, ఆఖరి పోరాటంతో పాటు..మొత్తం 6 సినిమాలలో శ్రీదేవి పని చేసింది.

మా బ్యానర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది.

సినిమాల్లోకి రాక ముందు సావిత్రి గురించి వినేవాడిని. కానీ సినిమాల్లోకి వచ్చాక మళ్లీ ఓ మహానటిని శ్రీదేవి రూపంలో చూశా. శ్రీదేవి లేని వైజయంతీ మూవీస్‌ను ఊహించుకోలేక పోతున్నా.

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తీస్తున్న 'మహానటి' సినిమాను శ్రీదేవికి అంకితమిస్తున్నాను.***  ***  ***


బోనీ కపూర్‌ పట్ల శ్రీదేవి ఎలా ఆకర్షితురాలయ్యారు?
(ఈ మేటర్ BBC.COM వెబ్సైట్ నుండి కాపీ చేయబడినది)

తన 51 ఏళ్ల సుదీర్ఘ సినీ కేరీర్‌లో శ్రీదేవి ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు.

అయితే ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఒక దశలో తీవ్రమైన చిక్కు సమస్యలు ఎదుర్కొన్నారు.

శ్రీదేవి తన కెరీర్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటున్న సమయంలోనే, తెర వెనుక ఆమె వ్యక్తిగత జీవితంలో ఓ ప్రేమ కథ పురుడు పోసుకుంది.

90వ దశకంలో ఆమె బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే బోనీ వివాహితుడు.

వీరివురి ప్రేమకు 1980వ దశకంలోనే పునాది పడింది. ఆ సమయంలో బోనీ కపూర్ నిర్మాతగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.


'మిస్టర్ ఇండియా' కథ ఇదీ!

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సమీక్షకుడు జయప్రకాశ్ చౌక్సే బీబీసీ ప్రతినిధి సుప్రియా సోగ్లేతో మాట్లాడుతూ, "మిస్టర్ ఇండియా సినిమా తీయాలని నిర్ణయించుకున్న తర్వాత రచయిత జావేద్ అఖ్తర్, బోనీ కపూర్ ఇద్దరూ శ్రీదేవికి ఈ సినిమా ఆఫర్ ఇవ్వడం కోసం చెన్నైకి వెళ్లారు" అని చెప్పారు.

"శ్రీదేవి తల్లి ఫోన్ చేసి వారిద్దరూ కొద్దిరోజులు వేచి ఉండాలని కోరారు. ఆ సమయంలో శ్రీదేవి చాలా బిజీగా ఉండేవారు. దాదాపు 3-4 రోజుల వరకు ఆమె నుంచి ఫోన్ ఏదీ రాలేదు."

"పని ముందుకు సాగేలా కనిపించకపోవడంతో జావేద్ విచారంలో పడిపోయారు. బోనీ కపూర్ కూడా విచారంలో పడ్డారు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు."

"బోనీ కపూర్ రోజూ శ్రీదేవి బంగ్లా చుట్టూ చక్కర్లు కొట్టసాగారు. 10 రోజుల తర్వాత శ్రీదేవి ఆయనకు కలిసేందుకు సమయం ఇచ్చారు. బోనీ చెప్పిన కథ ఆమెకు నచ్చింది. సినిమాలో పని చేసేందుకు ఆమె సిద్ధపడ్డారు."

తెరపై తొలిచూపులోనే ప్రేమ:బోనీ

దాదాపు ఐదేళ్ల క్రితం 'ఇండియా టుడే' నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బోనీ కపూర్ తన ప్రేమ కథ గురించి ఇలా చెప్పారు - "నేను శ్రీదేవిని మొట్టమొదటిసారి తెరపై చూసినపుడే ఆమెపై ప్రేమ మొదలైంది."

"70వ దశకంలో నేను ఆమెను ఓ తమిళ సినిమాలో చూశాను. వెంటనే ఆమెతో నా ఫిల్మ్‌లో సైన్ చేయించుకోవడం కోసం చెన్నైకు వెళ్లాను."

"అయితే ఆమె ఆ సమయంలో చెన్నైలో లేరు. ఆ తర్వాత ఆమెను 'సోల్‌వా సావన్‌'లో చూశాను. నా మనసులోంచి ఆమె రూపు అప్పటికీ చెదిరిపోలేదు. చివరకు ఎలాగోలా ఆమెతో 'మిస్టర్ ఇండియా' సినిమా కోసం సైన్ చేయించగలిగాను."

"అప్పుడు శ్రీదేవి తల్లిగారే ఆమె తరఫున నిర్ణయాలు తీసుకునే వారు. నేను శ్రీదేవితో సైన్ చేయించడం కోసం ముందుగా వాళ్ల అమ్మగారిని కలిశాను. ఆ రోజుల్లో శ్రీదేవి చాలా ఖరీదైన నటి."

"వాళ్లమ్మ గారు బహుశా నన్ను బెదరగొట్టడానికి 10 లక్షల ఫీజు ఇవ్వాలని అన్నారు. నేను 11 లక్షలిస్తానని అన్నాను."

"వాళ్లమ్మ గారితో నాకు దోస్తీ కుదిరింది. సెట్‌పై శ్రీదేవి కోసం నేను అన్ని ఏర్పాట్లు చేసి పెట్టేవాడిని. మంచి మేకప్ రూమ్, మంచి బట్టలు వగైరా. నిజానికి నేను అప్పటికే ఆమెతో ప్రేమలో పడ్డాను."

"ఆ రోజుల్లో ఆమె 'చాంద్‌నీ' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నేను ఏదో ఒక సాకుతో ఆమెను కలిసేందుకు స్విట్జర్లాండ్‌కు వెళుతుండేవాడిని. ఆ క్రమం అలా కొనసాగింది."

"నేను ఆమె ప్రతి అడుగులో తోడుగా ఉంటానని చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నించాను. క్రమంగా శ్రీదేవికి కూడా విషయం అర్థమైంది. నేను ఆమెను ప్రేమిస్తున్నానని."

శ్రీదేవి తల్లి అనారోగ్యం

శ్రీదేవి తల్లి జబ్బు పడ్డ సమయంలో, ఆ తర్వాత ఆమె మృతి చెందినప్పుడు వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని చెబుతారు.

"శ్రీదేవి తల్లిగారు అనారోగ్యం పాలయ్యారు. ఆమెకి బ్రెయిన్ సర్జరీ చేయించాల్సి ఉండింది. బోనీ కపూర్‌కు ఈ విషయం తెలియడంతో ఆయన చెన్నైకి వెళ్లారు" అని జయప్రకాశ్ చౌక్సే చెప్పారు.

"డాక్టర్ సలహాపై సర్జరీ కోసం ఆమెను అమెరికా తీసుకెళ్లారు. ఆ ట్రిప్‌లో బోనీ కపూర్ వెంటే ఉన్నారు. అయితే డాక్టర్లు శ్రీదేవి తల్లికి తప్పుడు సర్జరీ చేశారు."

"ఆసుపత్రి యాజమాన్యంపై శ్రీదేవి కేసు పెట్టారు. వారితో ఆఖరుకు సెటిల్‌మెంట్ జరగడంతో నష్టపరిహారం కింద రూ. 16 కోట్లు ఇచ్చారు."

"ఈ కష్ట సమయంలో బోనీ కపూర్ తన వెంట ఉంటూ తన తల్లికి సేవలు అందించడం.. ఇవన్నీ శ్రీదేవి గమనించారు."

"శ్రీదేవి తండ్రి ముందే మరణించారు. తల్లి మరణం తర్వాత ఆమెకు సానుభూతి తెలపడానికి బోనీ కపూర్ ఒక్కరే ఆమెకు తోడుగా ఉన్నారు. అలా సానుభూతితో మొదలైన వారి బంధం ప్రేమ బంధంగా మారిపోయింది."

దక్షిణాది నుంచి ఉత్తరం వైపు...

బోనీతో శ్రీదేవి 'మిస్టర్ ఇండియా', 'రూప్ కీ రాణీ చోరోం కా రాజా', 'మామ్' వంటి సినిమాలు చేశారు.

అయితే వీరిద్దరి బంధం అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఎందుకంటే అప్పటికే బోనీకి పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లల తండ్రి.

చివరకు 1990వ దశకంలో శ్రీదేవి, బోనీల వివాహం జరిగింది.

ఇద్దరి కుటుంబ నేపథ్యాలు పూర్తిగా భిన్నమైనవి. శ్రీదేవిది దక్షిణాదికి చెందిన కుటుంబం కాగా, బోనీ కపూర్‌ది పంజాబీ కుటుంబం.

"పెళ్లి తర్వాత శ్రీదేవి పంజాబీ ఆచారవ్యవహారాలను బాగా నేర్చుకున్నారు. ఆమె తనను తాను పంజాబీ కుటుంబానికి అనుగుణంగా మల్చుకునే ప్రయత్నం చేశారు" అని జయప్రకాశ్ చౌక్సే తెలిపారు.

"బోనీ కపూర్ కుటుంబం అంటే ఆయన సోదరులు, వాళ్ల పిల్లలతో కూడిన విశాల కుటుంబానికి శ్రీదేవి అంకితమైపోయారు."

"తన మామగారైన సురిందర్ కపూర్ 75వ జయంతి సందర్భంగా చెన్నైలో ఆమె ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. చెన్నైలోని తన బంగ్లాలో పూజలు నిర్వహించారు. పార్టీ ఇచ్చారు."

"ఆ పార్టీకి కమల్ హాసన్, రజినీకాంత్‌లు అతిథులుగా వచ్చారు. వారికి శ్రీదేవి స్వయంగా స్నాక్స్ సర్వ్ చేశారు. వారికి శ్రీదేవి అంటే ఎంతో అభిమానం."

"శ్రీదేవి తన ఆరోగ్యం పట్ల బాగా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ బోనీ కపూర్‌ మాత్రం తన ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధగా ఉంటుంటారు. ఈ విషయంపై ఆమె తరచుగా ఆయనతో వాదులాడేవారు."


*****  *****  ******


శ్రీదేవి ఫ్యామిలీతో బంధుత్వం.. 
అంబానీ జెట్ పంపింది అందుకే!

బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే హోటల్ గదిలో ప్రాణాలు వదిలారు. శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు తలెత్తినప్పటికీ.. చివరకు ఆమె బాత్‌టబ్‌లో పడిపోయి, స్పృహ కోల్పోవడం వల్లే చనిపోయారని దుబాయ్ అధికారులు తేల్చారు. శనివారం రాత్రి ఆమె మరణించగా.. మంగళవారం రాత్రి ఆమె భౌతిక కాయాన్ని ప్రయివేట్ జెట్‌లో ముంబై తీసుకొచ్చారు. 13 మంది కూర్చోగల సామర్థ్యం ఉన్న ఈ జెట్‌ను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సమకూర్చారు.

శ్రీదేవి భౌతికకాయం తరలింపు కోసం అనిల్ అంబానీ తన జెట్‌ను సమకూర్చడానికి ముఖ్య కారణం ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటమే. బోనీ కపూర్ మేనల్లుడు మోహిత్ మర్వా పెళ్లి వేడుకల్లో పాల్గొనడం కోసం శ్రీదేవి కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.

బోనీ కపూర్ సోదరి రీనా మార్వా కుమారుడైన మోహిత్.. అంతరా మోతివాలాను పెళ్లాడారు. అంతర.. అనిల్ అంబానీ భార్య టీనాకు స్వయానా అక్క కూతురు. వీరి పెళ్లితో అంబానీలకు బోనీ కపూర్ ఫ్యామిలీతో దగ్గరి సంబంధం ఏర్పడింది. శ్రీదేవి పార్థీవ దేహాన్ని దుబాయ్ నుంచి ముంబై తీసుకు రావడానికి అనిల్ అంబానీ తన జెట్‌ను సమకూర్చడానికి ఇది కూడా ఓ కారణమే.

No comments

Most Recent

Default