Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Veetori (Writer & Lyricist)పేరు: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి
జననం: 03.01.1934 రెల్లి వలస గ్రామం,
              పూసపాటి రేగ  మండలం, విజయనగరం జిల్లా                ఆంధ్రప్రదేశ్
మరణం: 21.09.1985 మద్రాస్ లో

వీటూరి (నాటకాల రచయిత) ఇతని పూర్తిపేరు వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి. "కల్పన" అనే నాటకము ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యారు.ఇంటి పేరుతో నాటక రచయితగా, పద్య రచయితగా ప్రసిద్ధుడు. తాత, తండ్రుల దగ్గర్నుంచి వారసత్వంగా పుచ్చుకున్న భాషా సాంగత్యంతో ఆయన ఛందస్సు, వ్యాకరణాన్ని అభ్యసించి, గ్రంథాలు చదివి, తానుగా పద్యాలు రాయడం ఆరంభించారు. తన పద్యాల్ని పత్రికలకు పంపడం, కవి సమ్మేళనాల్లో వినిపించడం చేసేవారు. పౌరాణికాలతో ఆగకుండా, సాంఘిక నాటకాలు కూడా రాశారు. తను రాసిన పురాణ నాటకాలకు తనే, హార్మోనీ వాయించేవారని అనేవారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పాఠశాలల్లో తెలుగు బోధించేవారు.  తన 12వ ఏట నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు వీటూరి.

             భీమిలిలో ఉపాధ్యాయశిక్షణ పూర్తిచేసి కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. స్వయంకృషితో తెలుగుభాషపై ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవాడు. ఈ ఉత్సాహమే అతనిచేత నాటకాలు రాయించింది. పగ, కరుణాశ్రమం, కల్పన, ఆరాధన, చంద్రిక మొదలైన నాటకాలు రాశారు వీటూరి. ఆయనే సొంతంగా నాటక సంస్థను స్థాపించి చాలా నాటకాలు వేశారు. ఆ సమయంలోనే విజయనగరంలో జరిగిన సన్మానసభలో వీటూరిని ‘తరుణ కవి’ అని బిరుదునిచ్చి సత్కరించారు. వీటూరి పేరుతోనే కాకుండా జ్యోతిర్మయి, జ్యోతికుమార్ అనే మారుపేర్లతో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన పత్రికల్లో కథలు రాశాడు.

     సినిమాలపై ఆసక్తి ఉండటంతో 1958లో మద్రాసు పయనమయ్యారు వీటూరి. సదాశివబ్రహ్మం, పాలగుమ్మి పద్మరాజుగార్ల దగ్గర లవకుశ, ఇంటిగుట్టు, కృష్ణలీలలు, భక్తశబరి వంటి చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసి సినిమా స్క్రిప్టు, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. ‘భక్తశబరి’లో కొన్ని పాటలు, పద్యాలు రాశారు. హెచ్.ఎమ్. రెడ్డిగారితో పరిచయం కలగడంతో ‘గజదొంగ’ చిత్రానికి వీటూరి మాటలు రాశారు.

           వీటూరి ‘స్వర్ణగౌరి (1962)’ చిత్రానికి కథ, మాటలు, పాటలు రాశారు. అలా ఆయనకు తొలిసారిగా పూర్తిస్థాయి అవకాశం వచ్చింది. తర్వాత వీటూరి రాసిన తొలి సాంఘిక చిత్రం ‘దేవత (1965)’. ఇందులో రాసిన పాటలు వీటూరికి మంచిపేరు తెచ్చాయి. నిర్మాత భావనారాయణ, జానపదబ్రహ్మ విఠలాచార్యలప్రోత్సాహంతో దాదాపు 42 చిత్రాలకు రచన చేశారు. వందకు పైగా పాటలు రాశాడు.

                వీటూరి ‘విజయలలిత పిక్చర్స్’ సంస్థను స్థాపించి ‘అదృష్టదేవత (1972)’ సినిమా నిర్మించారు. వీటూరి రాసిన ‘భారతి’ కథను స్వీయ దర్శకత్వంలో ‘భారతి (1975)’ చిత్రంగా తెరకెక్కించారు. దానికి మాటలు, పాటలు కూడా వీటూరివే. ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1967)’ చిత్రంలోని వీటూరి పాటతోనే ఎస్.పి.బాలు గాయకునిగా సినిమారంగ ప్రవేశం చేశారు.

వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి గారు 1958 లో ఇండస్ట్రీలో అడుగు పెట్టి 1985 వరకు తన సేవలను అందించారు

వేటూరి సుందరరామ మూర్తి గారు ఓ సీత కథ (1974)  సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి 2010 వరకు తన సేవలను అందించారు

 వీటూరి - వేటూరి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు, వీరిద్దరు (వీటూరి-వేటూరి)  కలిసి యమగోల (1977)  సినిమాకు పనిచేశారు తరువాత మల్లెపూవు (1978) సినిమాకు, మంగళ గౌరి (1980) ఈ మూడు సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి తరువాత 1984లో  వీటూరి గారు మద్రాసులో కన్నుమూశారు.


★★★  ★★★  ★★★


ఆంధ్రజ్యోతి లో 03.01.2015 న వీటూరి గారి గురించి ఒక కథనం ప్రచురించింది ఇది కూడా చదవండి

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి... (దేవత-1965), బలేబలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు (భక్తతుకారాం-1973), మబ్బే మసకేసిందిలే, పొగమంచే తెరగా నిలిచిందిలే (వయసు పిలిచింది-1978), నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా (మల్లెపువ్వు-1978)... తెలుగువారు ఏనాటికీ మరిచిపోలేని గీతాలు ఇవి. కానీ ఈ మధుర గీతాలు రాసిన మహాకవి ‘వీటూరి’ని మాత్రం చాలామంది మరిచిపోయారు. కారణం... ఆయన పేరు మరో మహాకవి వేటూరి పేరును పోలి ఉండడం! వీటూరి రాసిన గొప్ప పాటల వల్ల అప్పుడప్పుడూ ఆ పేరు వినిపించినా, దానిని వేటూరిగా భ్రమపడే అవకాశమే ఎక్కువ. వేటూరి, వీటూరి - ఇద్దరూ పాటలు రాసిన ‘యమగోల’ చిత్రం (1977) పాటల పుస్తకంలో చివరి పాటకు కవి పేరు ‘వీటూరి సుందరరామమూర్తి’ అని పొరబాటుగా ప్రచురించడం ఇలాంటి ప్రమాదానికి ఓ ఉదాహరణ!

వీటూరి పూర్తిపేరు వీటూరి వేంకట సత్యసూర్య నారాయణమూర్తి. 1934 జనవరి 3న విజయనగరం జిల్లా ‘రెల్లివలస’లో ఆయన జన్మించారు. భీమిలిలో ఉపాధ్యాయ శిక్షణను పూర్తిచేసి స్వల్ప కాలం ఆ వృత్తిలో ఉన్నారు. ‘అక్కాచెల్లెలు’ చిత్రానికి రచనా సహకారం అందించడానికి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఆయన పేరు వెండితెరకెక్కింది మాత్రం శ్రీ మురళీకృష్ణా ఫిలింస్‌ వారి డబ్బింగ్‌ చిత్రం ‘శ్రీ కృష్ణ లీలలు’(1956)తోనే! ఆ చిత్రంలో ‘మురళీధరా కృష్ణయ్య, నిన్నే నమ్ముకొంటినయ్యా’ అనే చివరి పాటను వీటూరి రాశారు. ఆ తర్వాత ‘మహారథి కర్ణ’, ‘జగదేకసుందరి’ అనువాద చిత్రాలకు ఇతరులతో కలిసి పాటలందించినా, 1962లో ‘ఏకైక వీరుడు’(మన్నాది మన్నన్‌) డబ్బింగ్‌ చిత్రానికి రచనతోనే పరిశ్రమలో స్థిరపడ్డారు. అదే ఏడు కృష్ణకుమారి, కాంతారావు జంటగా నటించిన ‘స్వర్ణగౌరి’ చిత్రానికి కూడా మాటలు, పాటలూ రాసే అవకాశం వచ్చింది. వీటూరి ప్రతిభను గుర్తించి విఠలాచార్య, పద్మనాభం, హీరో కాంతారావు ఆయనను ఎక్కువగా ప్రోత్సహించారు.

ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ గాయకుడిగా పరిచయమైన ‘ఓ! ఏమి ఈ వింత మోహం...’ (శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న 1967) గీతం వీటూరి (సు)కృతమే! అద్భుతమైన భావాలు కలిగిన ఎన్నో మధుర గీతాలతోపాటు నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన (బంగారు తిమ్మరాజు-1964), గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు (ఇదాలోకం-1973), గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను (యమగోల 1977) వంటి హుషారైన పాటలూ రాసి ఆయన శభాష్‌ అనిపించుకున్నారు.

వీటూరి రచన చేసిన శతాధిక చిత్రాలలో దాదాపు సగం డబ్బింగ్‌ చిత్రాలే! తెలుగులో తీసిన నాలుగు భాషల (హిందీ, తమిళ, కన్నడ, మలయాళ) డబ్బింగ్‌ చిత్రాలకూ రచన చేసిన ముగ్గురు కవుల్లో వీటూరి ఒకరు. ‘ఏకైక వీరుడు’ (మన్నాదిమన్ననే), మన్మథలీల’ (మన్మదలీలై), ‘ఎర్ర గులాబీలు’ (సిగప్పురోజాక్కళే), ‘ధనమే ప్రపంచలీల’ (తాయిక్కుతలైమగనే), ‘అమరగీతం’ (పయనంగళ్‌ ముడివదిల్లె), ‘పట్నంపిల్ల’ (మనిదరిల్‌ ఎత్తనయో నిరంగళ్‌) మొదలైనవి వీటూరి ప్రసిద్ధ అనువాద చిత్రాలు.

తమిళ చిత్రం ‘మన్నాది మన్నన్‌’లో ఎంజీఆర్‌ కథకూ, తన అన్నాడీఎంకే పార్టీకి రెంటికీ అన్వయించేలా ‘కణ్ణదాసన్‌’ చేత ఒక పాట రాయించారు. ‘అచ్చమ్‌ ఎలేబదు మడమైయడా, అంజామై ద్రావిడర్‌ ఉడమైయడా, ఆరిలుమ్‌ సావు నూరిలుమ్‌ సావు తాయగమ్‌ కాప్పదు కడమైయడా’ అనే ఈ పాటకు ‘‘భయమనేది మూర్ఖత్వం. సాహసం ద్రావిడ లక్షణం. ఆరేళ్లకు చచ్చినా, నూరేళ్లకు చచ్చినా మాతృభూమిని కాపాడడం మన కర్తవ్యం. చేర, పాండ్య రాజులు తమ వీరత్వంతో జన్మభూమిని పునీతం చేశారు. తమిళ తల్లులు తమ బిడ్డలకు పుట్టుకతోనే వీరత్వాన్ని నూరిపోస్తారు. ఆ తల్లి గౌరవానికి భంగం కలిగితే ఆ పుత్రులు శూరులై పైకి లేస్తారు’’ అని భావం. దీని తెలుగు డబ్బింగ్‌ ‘ఏకైక వీరుడు’ లో ‘న్యాయం ధర్మం మరువకురా, ఏనాడూ ఎవరికి వెరువకురా, ఆంధ్రుల త్యాగం, ఆంధ్రుల శౌర్యం అవనిలో స్థిరముగ నిల్పుమురా...’ అంటూ ప్రాంతీయ భావాన్ని ప్రభోదిస్తూ స్వేచ్ఛానువాదం చేశారు వీటూరి. చరణాల్లో రుద్రమదేవి, మాంచాల, బ్రహ్మన, బాలచంద్రుడు మొదలైన వారి వీర ప్రశంస చేయడం ద్వారా ఈ పాటకు పూర్తి తెలుగుదనాన్ని అద్దారు.

‘మన్మదలీలై’లోని ‘హలో మైడియర్‌ రాంగ్‌ నంబర్‌, కేట్కవే ఉందన్‌ కురల్‌ సొర్గమే, నెరితే పార్తాల్‌ ఎన్న వెట్కమే’ అనే మూల గీతానికి ‘హల్లో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌, గొంతుకే వింటే ఎంత మధురం, చెంతకే వస్తే ఎంత స్వర్గం’ అనే పాట తెలుగుదనం ఉట్టిపడే వీటూరి అనువాద ధోరణికి మరో నిదర్శనం. సె్ట్రయిట్‌ చిత్రాల్లోని పాటలతో సమంగా ప్రాచుర్యాన్ని పొంది నేటికీ చెవిమరుగు కాని వీటూరి అనువాద గీతాలకు మరికొన్ని ఉదాహరణలు 1. ఎదలో తొలి వలపే, విరహం జత కలిసే, మధురం ఆ తలపే నీ పిలుపే (ఎర్రగులాబీలు-1979) 2. నెలరాజా, పరుగిడకు, చెలి వేచే నా కొరకు (అమరగీతం-1982) 3. పయనించే చిరుగాలీ, నా చెలి సన్నిధిలో చేరి (పట్నం పిల్ల-1980), 4. త్రిపుర సుందరీ, దర్శనలహరీ (జగద్గురు శంకరాచార్య- 1981).
అనువాదకవిగా తన సత్తా నిరూపించుకున్న వీటూరి పట్ల ఆ రంగానికి చెందిన నిర్మాతలకు గల గురికి నిదర్శనమైన ఓ ఉదంతాన్ని గుర్తు చేసుకోవాలి. ‘శుభలేఖ’ చిత్రానికి ముహూర్త గీతంగా రికార్డు చేసిన వీటూరి పాట కారణాంతరాల వల్ల ఆ చిత్రంలో చోటుచేసుకోకపోతే - ఆ పాట నచ్చిన ‘బందిపోటు విప్లవ సింహం’ (తమిళంలో ‘రాణువవీరన్‌’) నిర్మాతలు దానిని తమ చిత్రంలో అదనపు పాటగా (మూలంలో లేదు) వినియోగించుకున్నారు. శ్రీదేవి, రజనీకాంత్‌, చిరంజీవి ప్రముఖపాత్రల్లో నటించిన ఈ భారీ చిత్రంలో దీనిని ఓ ఐటం సాంగ్‌గా చిత్రీకరించారు. వ్యక్తిగతంగా వీటూరి ఎలాంటి భేషజాలు లేని నిరాడంబరుడు, సహృదయుడు. ‘దేవత’ చిత్రానికి ‘సింగిల్‌ కార్డ్‌’ పడాల్సిన ఆయన నిర్మాత పద్మనాభం కోరిక మేరకు తను రాసిన బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, మావూరు మదరాసు, నా పేరు రాందాసు... అనే పల్లవులను ప్రసిద్ధులైన సహకవులకిచ్చి వారిచేత పాటలను రాయించారు. పై రెండింటిలో మొదటి పాటను రాసిన శ్రీశ్రీ వీటూరి ఔదార్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు కూడా! (‘పాడవోయి భారతీయుడా’ పుస్తకంలో).

వీటూరి చివరి అనువాద చిత్రం 1985 డిసెంబరు 6 న విడుదలయిన ‘యవ్వనం పిలిచింది’. ఆ చిత్రం విడుదల కాకుండానే వీటూరి 1985 సెప్టెంబర్‌ 21న అనారోగ్యంతో అకాల మరణం పాలయ్యారు. చనిపోయే నాటికి ఆయన పేరు తప్ప ఏమీ మిగుల్చుకోలేదు. అటు అనువాదాల్లోనూ, ఇటు నేరుగా తీసిన తెలుగుచిత్రాల్లో నేటికీ నిలిచిన ఆణిముత్యాల్లాంటి పాటలెన్నిటినో రచించిన వీటూరి ప్రతిభకు తగ్గ గుర్తింపు మాత్రం లభించకపోవడం బాధాకరం.

అక్కాచెల్లెళ్లు సినిమాలో సహాయ రచయితగా
శ్రీ కృష్ణ లీలలు
ఈశ్వర కటాక్షం
మహారథి కర్ణ
జగదేక సుందరి (1961)
దేవకన్య (1968)
ఏకైక వీరుడు (1962)
స్వర్ణగౌరి (1962) రచయితగా
శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న (1967)
బంగారు తిమ్మరాజు
ఇదాలోకం (1973)
యమగోల (1975)
దేవత (1965) పాటలు రచయిత గా,
చిక్కడు దొరకడు (1967),
కదలడు వదలడు,
సప్తస్వరాలు,
గుండెలు తీసిన మొనగాడు,
రాజసింహ,
రాజయోగం,
వీరపూజ,
కత్తికి కంకణం,
ఆకాశరామన్న,
శ్రీమతి,
భక్త తుకారాం (1973),
వినాయక విజయం,
లోగుట్టు పెరుమాళ్ళకెరుక
పగ సాధిస్తా (1970 సినిమా)
యమగోల (1977)
మల్లెపూవు (1978)
దేవదాసు మళ్లీ పుట్టాడు (1978)
చిరంజీవి రాంబాబు (1978)

No comments

Most Recent

Default